టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. సఫారీటూర్‌లో టెస్ట్ సిరీస్ కోల్పోయినా వన్డేలల్లో మాత్రం జట్టు సారథి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఆరు వన్డేల సీరీస్‌లో 2-0 తో టీమిండియా ముందుంది. విరాట్‌పై ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంశలు కురిపించారు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఓటమి గురించి అసలు ఆలోచించడని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గత కొన్నినెలలుగా టీమిండియా వన్డే, టీ20 జట్టులో చోటు కోల్పోయిన అశ్విన్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ విజయ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఆడుతున్నాడు. సఫారీ గడ్డపై జట్టుని విరాట్ కోహ్లి సమర్థంగా నడిపిస్తున్నాడని కితాబిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మూడో వన్డే కేప్‌టౌన్ వేదికగా బుధవారం జరగనుంది.
విరాట్ కోహ్లి ఎప్పుడూ గెలుపు కోసం పరితపిస్తుంటాడు. అతనికి అసలు ఓటమి ఆలోచనలే రావు. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా సరే.. విజయం గురించే మాట్లాడతాడు. ఇది జట్టులోని ఆటగాళ్లలో మరింత స్ఫూర్తి రగిలిస్తోంది. టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే తొలి దక్షిణాఫ్రికా పర్యటన.
ఇప్పటి వరకు భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్లందరూ స్వదేశంలో మంచి రికార్డులు నెలకొల్పి.. విదేశాల్లో తమ నాయకత్వాన్ని పరీక్షించుకున్నారు. విరాట్ కోహ్లి కూడా ఇప్పటికే స్వదేశంలో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడంటూ కితాబిచ్చారు అశ్విన్.