తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగా తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఇప్పటివరకు బాగానే ఉన్నా ఎన్నికల రేసులో దూసుకుపోతున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ చేరికల జోష్‌తో పాటు బస్సు యాత్రతో ప్రజలకు దగ్గరవుతోంది.
అయితే ఈ ఎన్నికల దంగల్‌లో వెనుకబడ్డది మాత్రం బీజేపీనే. ప్రధాని మోడీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ శ్రేణుల్లో మాత్రం జోష్ రావం లేదు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అధికారం మాదేనని, డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామని చెబుతున్న అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ …జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయించారు. తెలంగాణలో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. అయితే ఇప్పటికే 32 మంది కూడిన ఫస్ట్ లిస్ట్‌ని రిలీజ్ చేశారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అసలు లీస్టే ప్రకటించకుండా బీజేపీ నేతలు పవన్‌ని సంప్రదించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇక ఏపీలో ఇప్పటికే టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్నారు పవన్. చంద్రబాబు రిమాండ్ తర్వాత టీడీపీకి సైతం పవనే పెద్ద దిక్కుగా మారారు. ఇక తెలంగాణలో బీజేపీ ఇప్పుడు జనసేన మద్దతు కోరుతున్న తరుణంలో ఈ రెండు పార్టీలకు పవనే దిక్కు అయ్యారు అని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కోసం ఇంతగా ఆరాట పడుతున్న ఈ రెండు పార్టీలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది రిజల్ట్స్ తర్వాత తెలియనుందని సెటైర్లు వినిపిస్తున్నాయి.