జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ నిర్ణయంతో కొద్ది రోజులు ఏపీ పాలిటిక్స్‌కు విరామం ఇచ్చి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు పవన్. ఈ నేపథ్యంలో వారాహి యాత్రకు బ్రేక్ పడినట్లేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి మూడో ఫేజ్ వారాహి యాత్రను మొదలు పెట్టిన మూడు రోజుల్లోనే నిలిపేశారు పవన్. తర్వాత వారాహి యాత్ర గురించిన స్పష్టత రాలేదు.
ఇంతలోనే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడం, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండటంతో పవన్ ప్రచారం చేయాల్సిన అవసరం ఏర్పడింది. బీజేపీ నేతలు సైతం పవన్ ప్రచారం చేయడం కలిసి వస్తుందని భావిస్తుండగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 10వ తేదీతో నామినేషన్ల పర్వం ముగియనుండగా తర్వాత ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు జనసేనాని.
జనసేన పోటీ చేసే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఖమ్మం, వైరా, తాండూరు, కొత్తగూడెం, పినపాక, కోదాడ, నాగర్ కర్నూలు, అశ్వరావుపేటతో పాటు బీజేపీ ప్రధాన నాయకులు పోటీచేసే నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. దీంతో వారాహి యాత్రకు బ్రేక్ పడగా తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత యాత్ర ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ నిర్ణయం తప్పుడు ఆలోచన అని జనసైనికులే మాట్లాడుతున్న నేపథ్యంలో పవన్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి..