టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ అధినేత,సీఎం జగన్. అమ్మకు అన్నం పెట్టలేనోడు ఏదో చేస్తుంది అన్నట్లు చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో వరికపూడి శెల ఎత్తిపోథల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన జగన్.. అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టు చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు.
చంద్రబాబు తన బినామీల భూముల ధరలు పెంచుకునేందుకే అమరావతి రాజధానిని ఎంచుకున్నారని జగన్ విమర్శించారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఈ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేకపోయారని….తాము అన్ని అనుమతులు తీసుకున్నాకే .. వరికపూడిశెలకు శంకుస్థాపన చేశామని తెలిపారు. పేదలు మహిళల కోసంఒక్క పథకం పెట్టిన చరిత్ర కూడా చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. గతంలో ఎస్పీల్లో పుట్టాలనుకుంటారా? అని చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీల తోకలు కట్ చేస్తానని అహంకార పూరితంగా చంద్రబాబు మాట్లాడారని …కూతురిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి… పేదలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే ఆర్టీసీ, విద్యుత్‌లను ప్రైవేటు పరం చేసేవారని, ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తీసేసేవారని విమర్శించారు.