2024 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి ఇరు పార్టీలు. ఇందులో భాగంగా ప్రధానంగా సిట్టింగ్‌ల మార్పు, స్థాన చలనంపై దృష్టి సారించాయి.
అయితే వైసీపీ పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మారుస్తుందని ప్రచారం జరుగుతోండగా, ఓటమి భయంతోనే సిట్టింగ్‌లను మారుస్తున్నారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అభ్యర్థుల మార్పు అనేది అని పార్టీల్లో జరిగేదేనని దానిని భూతద్దంలో పెట్టి టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు.
ఇక చంద్రబాబు కుప్పంలో గెలుస్తాననే నమ్మకం లేకే రెండో చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టారు బొత్స. తుపాను కారణంగా జరిగిన పంట నష్టంపై చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని..ప్రజలకు అండగా ఉంది వైసీపీ మాత్రమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని వెల్లడించారు. ఇక చంద్రబాబు రెండు చోట్ల పోటీపై బొత్స చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.