పవన్‌ను టార్గెట్ చేసిన బీజేపీ!

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ – జనసేన కూటమికి మిశ్రమ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తామని భావించి బరిలోకి దిగిన ఈ రెండు పార్టీలు చతికిలపడ్డాయి. బీజేపీ సింగిల్ డిజిట్ 8 స్థానాలకు పరిమితం కాగా జనసేన కనీసం ప్రభావం చూపించలేకపోయింది. పవన్ స్వయంగా ప్రచారం చేసినా స్వతంత్య్ర అభ్యర్థి బర్కెలక్కకు వచ్చిన ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు జనసేన అభ్యర్థులు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఓటమికి పవన్‌నే పూర్తిగా బాధ్యుడిని చేసింది బీజేపీ. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పవన్‌ పార్టీతో పొత్తు లేదని ప్రకటించి ఆయనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది బీజేపీ. పవన్‌ వల్లే ఓడిపోయామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇక బీజేపీ నేతలు సైతం బహిరంగంగానే పవన్‌ వల్లే బీజేపీకి మెరుగైన ఫలితాలు రాలేదని మాట్లాడుతుండటంతో పవన్‌ పరిస్థితి అరిటాకులా మారిపోయింది.

ఎందుకంటే తెలంగాణలో పోటీ చేసి చతికిలపడటంతో ఆ ఎఫెక్ట్ ఏపీపై పడింది. వైసీపీ నేతలు పవన్‌ సత్తా ఏంటో తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ ప్రచారం చేయగా పెద్దగా ఉపయోగంలేక పోయింది. దీంతో పవన్‌ని టార్గెట్ చేస్తూ బయటపడాలని బీజేపీ ఆయనతో పొత్తు బంధాన్ని తెంచుకుంది. దీంతో ఇప్పుడు ఏపీలోనూ పవన్‌ పార్టీకి బీజేపీ నేతలు దూరంగా ఉంటారా..?ఏపీలోనూ ఒంటరిగా పోటీ చేస్తారా అన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.