పవన్‌కు ఇంకా క్లారిటీ లేదు!

టీడీపీతో పొత్తులో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్‌. ఈసారి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న పవన్‌..రెండు చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఎక్కడినుండి పోటీ అన్నది మాత్రం ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. అయితే పవన్ పోటీ చేసే స్థానంపై రోజుకో వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా పవన్‌ మరోసారి ఉత్తరాంధ్ర నుండే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం ఇదే విషయాన్ని పవన్‌కు తేల్చి చెప్పారట. ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తే జనసేన ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించారట. అయితే ఏ నియోజకవర్గం అన్నదానిపై మాత్రం కొణతాల స్పష్టత ఇవ్వలేదు.

2019లో గాజువాక నుండి పోటీ చేశారు పవన్‌. అయితే గాజువాకలో గతంతో పోలిస్తే జనసేన బలపడటంతో పవన్ నిలబడితే గెలవడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి గాజువాక పేరు మొదటి నుండి వినబడుతోంది. గాజువాకతో పాటు తిరుపతి, అనంతపురం, విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఓ స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల మాదిరిగానే రెండు చోట్ల పవన్ పోటీ చేయనుండగా త్వరలోనే దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.