హైదరాబాద్‌..కమర్షియల్ స్పేస్‌ కళ్లు చెదిరేలా!

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కమర్షియల్ ఆఫీస్ మార్కెట్‌లలో ఒకటి హైదరాబాద్. గత మూడేళ్లలో ఆఫీస్ అద్దెలు 24.1% పెరిగాయి. 2022లో చదరపు అడుగుకు ₹59 ఉండే సగటు అద్దె, 2025లో ₹72కి చేరింది. ఇది భారతదేశ నగరాల్లో రెండవ అత్యధిక వృద్ధి రేటుగా నిలిచింది.

ఈ భారీ అద్దె పెరుగుదలకు ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్, ఫైనాన్షియల్ మరియు స్టార్టప్ రంగాల నుంచి వచ్చిన పెరుగుతున్న డిమాండ్ కారణమైంది. ఈ రంగాలు హైదరాబాద్‌లోని కీలక బిజినెస్ హబ్‌లలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఆధునిక మౌలిక వసతులు, ప్రతిభావంతుల సమృద్ధి, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం వల్ల హైదరాబాద్ కంపెనీలకు ఇష్టమైన గమ్యస్థలంగా మారింది.

దేశంలో ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతం (MMR) అద్దె వృద్ధిలో మొదటి స్థానంలో ఉంది. ₹131 నుండి ₹168 చదరపు అడుగుకు (2022-2025) — 28% వృద్ధి చెందగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), అంధేరి ఈస్ట్, లోయర్ పరెల్ వంటి ప్రాంతాలు కార్పొరేట్ లీజుల హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి.

ఢిల్లీ NCR ₹92 నుండి ₹110 చదరపు అడుగుకు — 20% వృద్ధి చెందగా ప్రధానంగా నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి వల్ల ఈ వృద్ధి చోటుచేసుకుంది. బెంగళూరు 15.8% వృద్ధితో అద్దె రేటు ₹95 చదరపు అడుగుకు చేరింది. వైట్‌ఫీల్డ్, అవుటర్ రింగ్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాలు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.

2021 నుండి 2024 మధ్య కాలంలో ప్రధాన నగరాల్లో మూలధన విలువలు 128% పెరిగాయి. అయితే అద్దె రేట్లు మాత్రం కొన్ని లోకల్ మార్కెట్లలో కొంచెం నెమ్మదిగానే పెరిగాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం కంపెనీలు విస్తరించాలనుకునే ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.