దేశంలో మళ్లీ కొవిడ్ కోరలు చాస్తోంది. కర్ణాటకలో 38 యాక్టివ్ కేసులు నమోదు కాగా కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించిన ప్రకారం, బెంగళూరులో తొలి కోవిడ్-19 మరణం నమోదైంది. శనివారం 85 ఏళ్ల వృద్ధుడు మరణించారు. గత 24 గంటల్లో 108 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 5 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒకరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 38గా ఉంది.
మొత్తం 38 యాక్టివ్ కేసుల్లో 32 బెంగళూరులోనే నమోదయ్యాయి. నగరంలో 92 మందికి పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో ఇద్దరికి పాజిటివ్ తేలింది. బళ్లారి, బెంగళూరు రూరల్, మంగళూరు, విజయనగర జిల్లాల్లో ఒక్కొక్క యాక్టివ్ కేసు ఉండగా, మైసూరు జిల్లాలో రెండు యాక్టివ్ కేసులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
ముంబయి నుండి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటి నుండి ఆమెను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. బెల్గావిలో, గత నెలలో పుణెకు వెళ్లిన ఓ గర్భవతికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ధార్వాడ సహా అనేక జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా 10 బెడ్ల ఐసీయూ వార్డులు ఏర్పాటు చేశారు.ఆరోగ్య శాఖ సాంకేతిక సలహా కమిటీ ఆదివారం నుండి రాష్ట్రంలోని ఎనిమిది మెడికల్ కాలేజీల్లో కోవిడ్ పరీక్షలు ప్రారంభించాలని సూచించింది.
రాష్ట్రంలో ఇటీవల కోవిడ్ కేసుల పెరుగుదలపై ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ…ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితి సాధారణంగానే ఉంది. గత 15 రోజుల్లో కొద్దిగా పెరుగుదల ఉంది కానీ ఇది సాధారణం అన్నారు. ఆసుపత్రుల్లో ఉన్నవారు లేదా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చాం అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 257 కేసులు నమోదు అయ్యాయి. ఇవన్నీ తేలికపాటి లక్షణాలతో ఉన్నవే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని అధికారులు తెలిపారు.
