సినిమా ఇండస్ట్రీలో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు…తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హీరోగా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. వెండితెర మగ మహారాజుగా, ఇండస్ట్రీ పెద్దగా అందరి మన్ననలు పొందారు అన్నయ్య. ఇవాళ చిరు బర్త్ డే సందర్భంగా సినిమా, రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో తన ప్రత్యేకమైన ఆకర్షణ, అద్భుతమైన డాన్స్ మూవ్స్, చిరస్మరణీయమైన పాత్రలతో చిరంజీవి కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ‘ఖైదీ’, ‘ఇంద్ర’ వంటి క్లాసిక్ హిట్స్ నుండి ‘వాల్టేరు వీరయ్య’ వరకు ఎవర్గ్రీన్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పటికి కుర్ర హీరోలకు సవాల్‌గా నిలుస్తూ కొత్త తరానికి దారి చూపే మార్గదర్శకుడిగా, ట్రెండ్స్ సృష్టించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు చిరు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT) ద్వారా ఆయన రక్తదానం, నేత్రదానం రంగాల్లో విశేష సేవలు అందించి వేలాది మందికి ప్రాణదాతగా నిలిచారు. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆయన కట్టుబాటు ఆయనను నిజ జీవితంలోనూ హీరోగా నిలబెట్టింది. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఆసుపత్రులకు పెద్ద మద్దతుగా నిలిచారు. అదేవిధంగా, సినిమా రంగానికి చెందిన రోజువారీ వేతన కార్మికులకు ఆర్థిక సాయం అందించి కష్టకాలంలో తోడ్పడ్డారు.
ఇటీవల తెలుగు సినిమా సమ్మె సమయంలో కూడా చిరంజీవి ముందుకు వచ్చి కార్మికులు, నిర్మాతల సమస్యలను విని న్యాయమైన పరిష్కారాల కోసం కృషి చేశారు. సినీ పరిశ్రమలో స్థిరత్వం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఆయన పాత్ర విశేషమైంది.
