దేశంలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పెద్ద చర్చకు దారితీసింది. ఈ సవరణ ప్రకారం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు — తీవ్రమైన నేర కేసుల్లో అరెస్టై, 30 రోజులు జైలులో ఉంటే, పదవి నుండి తొలగింపుకు గురవుతారు.
ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) 2024 డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం — దేశంలోని 31 ముఖ్యమంత్రుల్లో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 10 మంది ముఖ్యమంత్రులుపై హత్యాయత్నం, అపహరణ, లంచం, బెదిరింపు వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో 7 మంది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచి, 2 మంది బీజేపీ మిత్రపక్షాల నుంచి, 1 బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్‌లో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ మొదటి స్థానంలో ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు మూడోస్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (కాంగ్రెస్): మొత్తం 89 కేసులు, వాటిలో 72 తీవ్ర ఆరోపణలు. వీటిలో బెదిరింపు (IPC 506), సమాజంలో విభేదాలు రెచ్చగొట్టడం (IPC 153A, 505), ఎన్నికల సమయంలో అవకతవకలు, మోసం (IPC 420), మహిళలపై దాడి (IPC 354) వంటి కేసులు ఉన్నాయి.
తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ (DMK): 47 కేసులు, 11 తీవ్రమైనవి. వీటిలో ఎన్నికల అవకతవకలు, సామాజిక విభజన రెచ్చగొట్టడం (IPC 153A), కిడ్నాప్ (IPC 363) వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (TDP): 19 కేసులు, 32 తీవ్రమైనవి. వీటిలో మోసం (IPC 420), హత్యాయత్నం (IPC 307), అవినీతి (IPC 409), కుట్ర (IPC 120B) వంటి ఆరోపణలు ఉన్నాయి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (కాంగ్రెస్): 13 కేసులు, అందులో లంచం, ఎన్నికల అవకతవకలు, ఆస్తి ధ్వంసం (IPC 435) వంటి కేసులు ఉన్నాయి. జార్ఖండ్ CM హేమంత్ సోరెన్ (JMM): 5 కేసులు, అందులో మోసం (IPC 420), దొంగతనం (IPC 379), నకిలీ పత్రాలు (IPC 467, 468) వంటి ఆరోపణలు ఉన్నాయి.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (BJP): 4 కేసులు, అందులో మోసం (IPC 420), నమ్మకద్రోహం (IPC 406) ఆరోపణలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ (కాంగ్రెస్): 4 కేసులు, అందులో తప్పుడు ప్రమాణం (IPC 181), ఎన్నికల సమయంలో అవకతవకలు ఆరోపణలు ఉన్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ (CPM): 2 కేసులు, అవినీతి, మోసం, కుట్ర ఆరోపణలు ఉన్నాయి.సిక్కిం సీఎం పి.ఎస్. తమాంగ్ (SKM): 1 కేసు, అందులో నమ్మకద్రోహం (IPC 406), కుట్ర ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్సీఎం భగవంత్ మాన్ (AAP): 1 కేసు, పోలీసులపై దాడి, రౌడీ షీట్లు వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ డేటా ప్రకారం, 42% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
