అల్లువారి ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియురాలు నయనికతో శిరీష్ నిశ్చితార్థం ఇటీవలే ఘనంగా జరగడంతో, వీరి పెళ్లి తేదీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆ ఉత్కంఠకు తెరదిస్తూ అల్లు శిరీష్ అధికారికంగా వెడ్డింగ్ డేట్‌ను ప్రకటించారు.
వచ్చే ఏడాది మార్చి 6, 2026న వివాహం జరగనున్నట్లు శిరీష్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన రీల్ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పాటకు, అల్లు అర్హా, అల్లు అయాన్‌తో కలిసి శిరీష్ ఈ రీల్‌ను చేశారు. వీడియోలో పిల్లలు బాబాయ్ పెళ్లి ఎప్పుడు? అని అడగగా, శిరీష్ మార్చి 6, 2026 అని సమాధానం ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. అలాగే సంగీత్ ఎప్పుడు? అనే ప్రశ్నకు మనం దక్షిణాదివాళ్లం, అలాంటివి చేసుకోం అంటూ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
శిరీష్–నయనికది ప్రేమ వివాహం. హీరో నితిన్ భార్య ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి పెళ్లి జరగనుంది. ఇక సినీ విషయానికి వస్తే, అల్లు శిరీష్ చివరిసారిగా **2024లో విడుదలైన యాక్షన్–కామెడీ ఫాంటసీ చిత్రం ‘బడ్డీ’లో కనిపించారు.
