మెగాస్టార్ చిరంజీవి తన జీవిత భాగస్వామి సురేఖ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1980 ఫిబ్రవరి 20న వివాహం జరిగినప్పటి నుంచి ఆమె తనకు అతిపెద్ద బలమని ఆయన పేర్కొన్నారు.
‘ఇంద్ర’ నటుడు సోషల్ మీడియాలో పలు అరుదైన ఫొటోలు పంచుకుంటూ, “డియరెస్ట్ సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. మన వివాహం జరిగిన రోజు నుంచి నీవే నా శక్తి. నీ పుట్టినరోజు, అలాగే రాబోయే మా వివాహ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది” అని రాశారు.
తమ కుటుంబాన్ని ప్రేమతో కట్టిపడేసే కేంద్రబిందువు (న్యూక్లియస్) సురేఖేనని ఆయన అన్నారు. తన కుటుంబ సభ్యులను స్వంతంగా చూసుకున్న ఆమె నిజమైన కోడలిగా తల్లిదండ్రుల మనసు గెలుచుకుందని తెలిపారు. తన విజయ రహస్యం ప్రతిభ కాదు, కష్టం కాదు “నువ్వే” అని చిరంజీవి భావోద్వేగంగా రాశారు. కుటుంబ బాధ్యతలను నిశ్శబ్దంగా భుజాన వేసుకున్నందువల్లే తాను తన వృత్తిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగానని అన్నారు. ప్రతి సంక్షోభంలో, ప్రతి ఆనంద క్షణంలో కుటుంబాన్ని ఒక్కటిగా నిలిపేది సురేఖేనని తెలిపారు.
