వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు మద్దతుగా నిలిచాడు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 3 స్థానంలో తిలక్ ఆటతీరుపై ఎలాంటి సందేహం, ఆందోళన అవసరంలేదన్నారు. ఈ వరల్డ్ కప్‌లో తిలక్.. 25, 25, 25, 31 వంటి చిన్న స్కోర్లు చేశాడు. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా తిలక్‌కు సపోర్టుగా నిలిచిన సూర్య…. స్ట్రైక్‌రేట్ కూడా ఆశించినంతగా లేకపోయినా, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడుతున్నాడని పేర్కొన్నారు.
ఒక వికెట్ మాత్రమే పడితే తిలక్ తన సహజ ఆటను ఆడవచ్చని, కానీ రెండు వికెట్లు త్వరగా పడితే భాగస్వామ్యం నిర్మించి 10వ ఓవర్ వరకూ జట్టును స్థిరపరచాలని మేనేజ్‌మెంట్ సూచించినట్లు తెలిపారు. తిలక్ మరింత మెరుగ్గా రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందన్నారు.
అతని స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకురావాలనే సూచనను కూడా ఆయన కొట్టిపారేశారు. అలాగే ఇప్పటివరకు పరుగులు చేయని అభిషేక్ శర్మపై ఆందోళన అవసరం లేదని చెప్పారు. జట్టు బ్యాటింగ్ విధానం గురించి మాట్లాడుతూ, ప్రతి బంతిని బాదడం లక్ష్యం కాదని, మధ్య ఓవర్లలో తెలివిగా ఆడటం ముఖ్యమని వివరించారు. పరిస్థితులకు అనుగుణంగా నంబర్-3 నుంచి 7 లేదా 8 వరకు బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేయగల సౌలభ్యం జట్టులో ఉందని సూర్యకుమార్ తెలిపారు.
