- Advertisement -

జనసేన ఎమ్మెల్యేతో టీడీపీ ఇంచార్జ్ క్లాష్‌!

- Advertisement -

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. స్థానిక జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వర్సెస్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పడాల భూదేవి మధ్య కోల్డ్‌వార్ పీక్ స్థాయికి చేరుకుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు నేతలు గతంలో టీడీపీలోనే పనిచేశారు.

గత ఎన్నికల ముందు పాలకొండ రిజర్వ్ సీటు కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీపడ్డారు. అయితే కూటమి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీతో దీర్ఘకాల అనుబంధం ఉన్న జయకృష్ణ జనసేనలో చేరి, చివరికి అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు టీడీపీ క్యాడర్‌లో ఉన్న పాత పరిచయాలు, వ్యక్తిగత సంబంధాలు ఎన్నికల్లో బాగా ఉపయోగపడ్డాయని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు టికెట్ ఆశించి నిరాశ చెందిన పడాల భూదేవిని టీడీపీ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అయితే ఆ నిర్ణయం తరువాత టీడీపీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం ఎమ్మెల్యే జయకృష్ణకు మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం భూదేవి నాయకత్వాన్ని సమర్థిస్తోంది.

ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎమ్మెల్యేగా జయకృష్ణ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన ముద్ర వేయాలనుకుంటున్నారు. అదే సమయంలో భూదేవి పార్టీ నిర్మాణంపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భూదేవి వర్గం దూరంగా ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే భూదేవి ఆధ్వర్యంలో జరిగే పార్టీ సమావేశాలకు జయకృష్ణ అనుచరులు హాజరు కావడం లేదని చెబుతున్నారు.

మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల అంశం ఈ విభేదాలకు మరింత మంట రాజేసింది. పార్టీకి ఏళ్ల తరబడి సేవ చేసిన వారిని పక్కన పెట్టి, తనకు అనుకూలంగా ఉన్నవారిని డైరెక్టర్లుగా నియమించారంటూ భూదేవి వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థి జయకృష్ణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు ఇచ్చారంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పాలకొండ, వీరఘట్టం మండలాల నేతలు ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తానే ఫైనల్ మాట చెప్పాలని జయకృష్ణ భావిస్తుండగా, పార్టీ ఇన్‌ఛార్జ్‌గా తన నిర్ణయాలే అమలవ్వాలని భూదేవి పట్టుదలగా ఉన్నారనే ప్రచారం ఉంది. మొత్తంగా పాలకొండలో జరుగుతున్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -