టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. మార్చి 19న విడుదల కావాల్సిన కన్నడ భారీ చిత్రం “టాక్సిక్” వాయిదా పడటం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రణాళికలు వేసినప్పటికీ, ఇప్పుడు ఆ సినిమా జూన్ 4కి మారింది.
ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందం తమ విడుదల తేదీని ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదట మార్చి 26న విడుదల చేయాలని నిర్ణయించిన ఈ చిత్రాన్ని, ఇప్పుడు మార్చి 19న విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
మార్చి 19న తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం ఉండటంతో, ఆ శుభదినాన సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు కూడా మార్చి 19 విడుదలకు సిద్ధంగా ఉండాలని సమాచారం అందించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి “ఉస్తాద్ భగత్ సింగ్” విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
