ఒకప్పుడు నటుడిగా, ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘తీన్ మార్’. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
ఆ సమయంలో ‘తీన్ మార్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, కాలక్రమేణా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గతంలో ఒక సందర్భంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని కొన్ని లోపాలను సరిదిద్ది (Revised Version) మళ్ళీ విడుదల చేస్తానని ప్రామిస్ చేశారు. ఇప్పుడు సినిమాకు 15 ఏళ్లు నిండిన తరుణంలో అభిమానులు ఆయనకు ఆ మాటను గుర్తు చేస్తున్నారు.
అభిమానుల అభ్యర్థనలను బండ్ల గణేష్ నిశితంగా గమనిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత గురించి తాను గతంలో మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. ముఖ్యంగా, “పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ రివైజ్డ్ వెర్షన్‌ను విడుదల చేయండి” అని ఒక అభిమాని కోరగా, బండ్ల గణేష్ దానికి “100%” అంటూ బదులిచ్చారు. దీనితో తీన్ మార్ రీ-రిలీజ్ పై ఆశలు చిగురించాయి.
