శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఒక ఆసక్తికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) అధికారిగా నటిస్తూ, అమాయక యువతులను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని ఎయిర్పోర్ట్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే, మొదటి భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న బాలకృష్ణ, రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఈ క్రమంలో అతను ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
తాను ఒక ప్రభుత్వ ఉద్యోగినని చెప్పుకుంటే సులభంగా సంబంధాలు వస్తాయని భావించిన బాలకృష్ణ, ఏకంగా CISF అధికారి వేషం వేశాడు.యూనిఫాంలో ఫోటోలు దిగి సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేశాడు.దాదాపు 70 మందికి పైగా యువతులతో నిరంతరం చాటింగ్ చేస్తూ వారిని నమ్మించాడు.ముఖ్యంగా విడాకులు తీసుకున్న యువతులను టార్గెట్ చేస్తూ, తాను పెద్ద ఉద్యోగినని నమ్మబలికాడు.
అయితే, పాపం పండక తప్పదు అన్నట్లు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో బాలకృష్ణ CISF యూనిఫాం మారుస్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది కంటపడ్డాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది.నిందితుడు యూనిఫాం వేసుకుని అధికారిలా ఫోజులిస్తూ యువతులను ట్రాప్ చేస్తున్నాడని, విచారణలో అతను ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలిందని అధికారులు వెల్లడించారు.
బాలకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వద్ద ఉన్న నకిలీ ఐడీ కార్డులు, యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. మ్యాట్రిమోనీ సైట్లలో వ్యక్తులను కలిసేటప్పుడు వారి ఉద్యోగ బాధ్యతలు, నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, కేవలం ఫోటోలు చూసి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
