బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ డాన్ 3 (Don 3) నుండి హీరో రణ్‌వీర్ సింగ్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో మొదలైన వివాదం ఇప్పుడు ముంబై చిత్ర పరిశ్రమలో పలు మలుపులు తిరుగుతోంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం రణ్‌వీర్ సింగ్‌పై పరిశ్రమ నిషేధం (Ban) విధించిందంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్, ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ స్పష్టతనిచ్చారు.
రణ్‌వీర్ సింగ్‌ను తాము బ్యాన్ చేయలేదని.. తామేమీ శిక్షలు వేయడానికి కోర్టు కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాము కేవలం సహాయ నిరాకరణ (Non-Cooperation Directive) ఉత్తర్వులు మాత్రమే జారీ చేశామని స్పష్టం చేశారు. దీని ప్రకారం ఫెడరేషన్‌కు చెందిన 30కి పైగా విభాగాల (క్రాఫ్ట్స్) లోని ఏ టెక్నీషియన్.. కెమెరామెన్.. లైట్‌మెన్.. స్పాట్ బాయ్.. వ్యానిటీ వ్యాన్ల సప్లయర్లు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి పని చేయకూడదని తమ సభ్యులకు సూచించామని అశోక్ పండిట్ వివరించారు.
‘డాన్ 3’ చిత్రానికి సంబంధించి ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత.. దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఏప్రిల్ 11న ఫెడరేషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ కోసం యూనిట్ అంతా విదేశాలకు బయలుదేరడానికి కేవలం మూడు వారాల ముందే రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నారని.. దీనివల్ల ప్రీ-ప్రొడక్షన్.. లొకేషన్ బుకింగ్స్ రూపంలో తాము రూ.45 కోట్లు నష్టపోయామని ఫర్హాన్ అఖ్తర్ ఆరోపించారు.
ఈ సమస్యపై చర్చించడానికి పర్సనల్‌గా హాజరుకావాలంటూ రణ్‌వీర్ సింగ్‌కు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ మూడుసార్లు నోటీసులు (ప్రతి 10 రోజులకు ఒకసారి) పంపినా ఆయన స్పందించలేదు. ఫెడరేషన్ ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత రణ్‌వీర్ సెక్రటరీ మెయిల్ పంపుతూ.. ఈ వివాదం అసలు ఫెడరేషన్ పరిధిలోకి (Jurisdiction) రాదని.. అందుకే రణ్‌వీర్ వ్యక్తిగతంగా హాజరుకారని పేర్కొనడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఒక సూపర్ స్టార్ వ్యవస్థ కంటే పెద్దవాడు కాదనే సందేశాన్ని ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ తెలిపారు.
ఈ వివాదంపై రణ్‌వీర్ సింగ్ అధికారిక ప్రతినిధి స్పందిస్తూ.. “రణ్‌వీర్ సింగ్‌కు చిత్ర పరిశ్రమ అన్నా.. ‘డాన్’ ఫ్రాంచైజీ అన్నా ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి వృత్తిపరమైన విషయాలు.. వ్యక్తిగత బంధాలను చాలా హుందాగా.. పరిణతితో.. పరస్పర గౌరవంతో ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలని ఆయన నమ్ముతారు. అందుకే ఈ వివాదంపై బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయకుండా ఆయన మౌనం పాటిస్తున్నారు.” అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమిర్ ఖాన్ వంటి పెద్దలు మధ్యవర్తిత్వం వహించినా ఈ సమస్య సర్దుమణగలేదు. రణ్‌వీర్ స్వయంగా వచ్చి మాట్లాడేంత వరకు ఈ నాన్-కోఆపరేషన్ కొనసాగుతుందని మూవీ బాడీ వెల్లడించింది.
