కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ హీస్ట్ థ్రిల్లర్ మూవీ ‘కర’ (Kara) ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునేలా ప్లాన్ చేసింది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ‘కర’.. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సాధారణంగా థియేటర్లలో మిస్ అయిన ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుండటంతో మేకర్స్ కూడా డిజిటల్ రెస్పాన్స్ పై ఆశలు పెట్టుకున్నారు.
పెద్ద బ్యాంక్ దోపిడీ.. దాని చుట్టూ సాగే మైండ్ గేమ్స్ నేపథ్యంతో సాగే ఈ కథలో విఘ్నేష్ రాజా తన మార్క్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీకెండ్ లో మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఈ చిత్రం ఒక మంచి ఆప్షన్ కానుంది.
ఈ చిత్రంలో ‘ప్రేమలు’ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న మమితా బైజు కథానాయికగా నటించింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఇషారి కె.గణేష్.. థింక్ స్టూడియోస్‌తో కలిసి ఈ భారీ హీస్ట్ థ్రిల్లర్‌ను సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు సూరజ్ వెంజరామూడు, సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్, జయరామ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టార్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సంగీతం థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి.
