తెలంగాణ సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న పర్సంటేజీల వివాదానికి తెరపడింది. అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బుధవారం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. చిరంజీవి చొరవతో పర్సంటేజీ విధానం నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు ప్రస్తుతానికి వాయిదా వేశారు. జూన్ 4న విడుదల కానున్న రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi) ని పాత పద్ధతిలోనే.. అంటే రెంటల్ (అద్దె) విధానంలోనే థియేటర్లలో ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాతలు.. పంపిణీదారులు.. ఎగ్జిబిటర్ల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారం కోసం ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే జూన్ మొదటి వారంలో రాబోతున్న ‘పెద్ది’ చిత్రాన్ని అద్దె విధానంలో ఆడించలేమని ఎగ్జిబిటర్లు భీష్మించుకోగా.. కొందరు నిర్మాతలు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సినిమా విడుదలకు ఆటంకం కలగకుండా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. మే 25న ఆయనతో మొదటి విడత భేటీ అయిన ఎగ్జిబిటర్లు, బుధవారం మరోసారి సమావేశమై తమ తుది నిర్ణయాన్ని ప్రకటించారు.
జూన్ 30 తర్వాత థియేటర్లలోకి వచ్చే కొత్త చిత్రాలకు మాత్రమే ఈ పర్సంటేజీ విధానాన్ని వర్తింపజేస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. పరిశ్రమ హితం కోసం తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ఇచ్చే నివేదిక.. మార్గదర్శకాలకు లోబడి అందరూ నడుచుకోవాలని ఆయన ట్రేడ్ వర్గాలకు సూచించారు. మెగాస్టార్ రాయబారంతో ‘పెద్ది’ సినిమా విడుదలకు థియేటర్ల పరంగా ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోవడంతో మెగా అభిమానులు.. చిత్ర నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో సందడి చేయనుంది.
