టాలీవుడ్ డిజిటల్ స్పేస్‌లో సంచలన విజయం సాధించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ మొదటి రెండు సీజన్ల భారీ సక్సెస్ సాధించింది, త తర్వాత.. ఇప్పుడు మూడో సీజన్‌తో డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌కు సంబంధించిన సరికొత్త.. అత్యంత వినోదాత్మక ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈసారి కేవలం భూలోకంలోని భార్యాభర్తల గొడవలే కాకుండా.. కథ ఏకంగా స్వర్గలోకానికి చేరి కాస్మిక్ కామెడీగా మారబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ట్రైలర్ మనకు బాగా అలవాటైన పాత వాతావరణంలోనే ఓ బార్ సీన్‌తో ఓపెన్ అవుతుంది. పెళ్లి అనే పవిత్ర బంధం చుట్టూ ఉన్న భ్రమల గురించి.. తమ వ్యక్తిగత బాధలను పంచుకోవడానికి ముగ్గురు విసిగిపోయిన భర్తలు మళ్లీ ఒకచోట చేరారు. పెళ్లిని అంతగా రొమాంటిసైజ్ చేసిన (గొప్పగా చూపించిన) వారిపై రాహుల్ (అభినవ్ గోమఠం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. అసలు ‘పవిత్ర వివాహం’ అనే పదాన్ని పురుషుల శత్రువు ఎవరో కనిపెట్టాడంటూ విక్రమ్ (కృష్ణ చైతన్య) వెంటనే అందుకుంటాడు. వీరితో పాటు ఎప్పుడూ ఏడుస్తూ ఉండే వారి పాత స్నేహితుడు ఘంటా రవి (ప్రియదర్శి) కూడా ఈ బాధల సభలో జాయిన్ అవుతాడు.
ఇక వీరి ఇళ్లలో నడుస్తున్న గొడవలు ఈ సీజన్‌లో పీక్స్‌కు చేరాయి. భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైన అంశాలపై విక్రమ్ చట్టపరమైన పోరాటం (లీగల్ బ్యాటిల్) మొదలుపెడతాడు. సంపాదించని భర్తలను సమాజం చూసే విధానానికి వ్యతిరేకంగా అతను వాదిస్తుండగా.. అతని భార్య రేఖ (దేవ్యాని శర్మ) మాత్రం తన పట్టు వీడకుండా గట్టిగా నిలబడుతుంది. మరోవైపు రాహుల్-మాధురి (పవని గంగిరెడ్డి).. అలాగే ఘంటా రవి-హైమావతి (జోర్దార్ సుజాత) ల మధ్య ఉన్న సంసార తాపత్రయాలు.. గొడవలు ఈ సీజన్‌లోనూ కొనసాగుతున్నాయి.
ఈ సీజన్లో మన ముగ్గురు హీరోలు అకస్మాత్తుగా ఒక ప్రత్యామ్నాయ ప్రపంచంలోకి (Alternate Parallel Realities) ప్రవేశిస్తారు. అక్కడ వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఘంటా రవి (ప్రియదర్శి) ఒక సాధారణ వ్యక్తి నుండి ఏకంగా ఒక పవర్‌ఫుల్ ఎమ్మెల్యేగా మారిపోతాడు. రాహుల్ (అభినవ్ గోమఠం), తన ఫ్రీలాన్సింగ్ కష్టాల నుండి తప్పించుకుని ఒక సక్సెస్‌ఫుల్ స్క్రీన్‌రైటర్ (సినిమా రచయిత) అవుతాడు. విక్రమ్ (కృష్ణ చైతన్య).. ఒక పెద్ద కంపెనీకి హై-పవర్డ్ సీఈఓ (CEO) గా దూసుకుపోతుంటాడు.
జూన్ 19 నుండి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్.. ఇటు భూలోకంలోని గొడవలను.. అటు స్వర్గలోకం సృష్టించిన ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని సమాంతరంగా చూపిస్తూ ప్రేక్షకులను నవ్వుల సముద్రంలో ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
