సుదీర్ఘమైన 64 రోజుల క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మహా సంగ్రామంలో టైటిల్ కోసం తలపడనున్నాయి.
2025 ఐపీఎల్ ఫైనల్‌తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ కూడా ఇదే పిచ్‌పై జరిగాయి. 2025 నుండి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. మిగతా పిచ్‌లతో పోలిస్తే దీనిపైనే అత్యల్ప సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు (199 పరుగులు) నమోదైంది. సాధారణంగా అహ్మదాబాద్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే ఎక్కువ విజయావకాశాలు (16 విజయాలు, 8 ఓటములు) ఉన్నప్పటికీ, ఈ పర్టికులర్ పిచ్‌పై మాత్రం ఫలితాలు 3-3తో సమానంగా ఉన్నాయి. ఈ సీజన్లో ఈ పిచ్‌పై జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. మే నెలలో ఈ పిచ్‌ను అస్సలు ఉపయోగించకపోవడం వల్ల, ఫైనల్ మ్యాచ్‌కు ఇది తాజాగా (Fresher) ఉండే అవకాశం ఉంది.
ఈ సీజన్లో పవర్‌ప్లేలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు పేస్ అటాక్స్ ఈ ఫైనల్లో తలపడబోతున్నాయి. ఆర్సీబీ…జీటీ చెరో 33 వికెట్లు పవర్‌ప్లేలోనే పడగొట్టాయి. టైటాన్స్ బౌలర్లు మొదటి ఆరు ఓవర్లలో 56.6% బంతులను గుడ్-లెంగ్త్ ఏరియాలోనే వేశారు. ఆర్సీబీ కూడా 51.8% బంతులతో దీనికి ఏమాత్రం తీసిపోలేదు.
ముఖ్యంగా ఆర్సీబీ విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌కు…గుజరాత్ టైటాన్స్ యొక్క పటిష్టమైన బౌలింగ్ డెప్త్‌కు మధ్య ఈ మ్యాచ్ ప్రధానంగా సాగనుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అడ్డుకోవడానికి గుజరాత్ పేసర్ కాగిసో రబాడ, మిడిల్ ఓవర్లలో జేసన్ హోల్డర్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అహ్మదాబాద్ గ్రౌండ్స్ పెద్దవి కావడం వల్ల కోహ్లీని షార్ట్ పిచ్ బంతులతో బోల్తా కొట్టించాలని జీటీ వ్యూహాలు రచిస్తోంది.
అలాగే మిడిల్ ఓవర్లలో అసాధారణమైన స్ట్రైక్ రేట్‌తో చెలరేగుతున్న రజత్ పాటిదార్‌ను ఆపడం గుజరాత్ బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్లకు ఆర్సీబీ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌పై పేలవమైన రికార్డు ఉంది. భువీ ఇన్‌స్వింగర్లను తట్టుకుని గిల్, బట్లర్ నిలబడితే గుజరాత్‌కు తిరుగుండదు. అయితే ఈ సీజన్లో గుజరాత్ జట్టు ఏకంగా 26 క్యాచ్‌లు వదిలేసి ఫీల్డింగ్‌లో బలహీనంగా కనిపించింది. క్వాలిఫైయర్-1 లో పాటిదార్ క్యాచ్‌లు వదిలేయడం వల్లే జీటీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇలాంటి హై-ప్రెజర్ ఫైనల్ మ్యాచ్‌లో క్యాచ్‌లు చేజార్చకుండా… అవకాశాలను అందిపుచ్చుకునే జట్టే ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
