గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మల్టీప్లెక్స్‌లలో కొన్ని చిన్నపాటి సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ.. ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ (Paid Premieres) ద్వారానే ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రాథమిక ట్రేడ్ అంచనాల ప్రకారం.. కేవలం భారతదేశంలో జరిగిన పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా దాదాపు రూ. 21 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఓవర్సీస్ అప్డేట్స్తో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే రూ. 40 కోట్ల మార్కును తాకినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రామ్ చరణ్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు రాజీపడకుండా నిర్మించిన హై-స్టాండర్డ్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని ఆడియన్స్ కొనియాడుతున్నారు.
ఈ నేపథ్యంలో.. ‘పెద్ది’ సంచలన విజయంపై మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన పొల్లాచిలో తన తాజా చిత్రం ‘మెగా158’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ.. సమయం కుదుర్చుకుని ‘పెద్ది’ సినిమాను వీక్షించారు. కొడుకు చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ.. “ఈరోజు థియేటర్లలో ‘పెద్ది’ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణ చూస్తుంటే ఒక తండ్రిగానే కాకుండా.. ఒక తోటి నటుడిగా నా గుండె గర్వంతో నిండిపోతోంది” అని చిరంజీవి రాసుకొచ్చారు.
గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టాన్ని తాను చాలా దగ్గర నుండి చూశానని మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు. “పెద్ది క్యారెక్టర్లోకి పూర్తిగా లీనమైపోవడానికి చరణ్ పడిన నిరంతర శ్రమ, పట్టుదల, నిబద్ధత ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను పెట్టిన ప్రతి Effortకు దక్కిన తగిన పారితోషికమే ఈరోజు బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్న ఈ భారీ సక్సెస్.” అని అభినందించారు. ఇంతటి బలమైన కథను వెండితెరపై అత్యంత అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు బుచిబాబు సానాను, ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా గ్రాండ్‌గా నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారును చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, దివ్యేందులతో పాటు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, ఎడిటర్ నవీన్ నూలి మరియు పెద్ది చిత్ర యూనిట్ అందరికీ మెగాస్టార్ పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. ‘పెద్ది’ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఒక గొప్ప మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని, థియేటర్లలో దీని విజయయాత్ర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ చిరంజీవి తన సందేశాన్ని ముగించారు.
