- Advertisement -

బిడ్డ భవిష్యత్‌పై బెంగతో కుటుంబం ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -

నెల్లూరు జిల్లా సంగం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుమారుడి ఉద్యోగ భవిష్యత్తుపై ఆందోళనతో రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దువ్వూరు గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది.

చీరాల మధుసూదన్‌రావు (65) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఆయన తన భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్‌ (26)తో కలిసి దువ్వూరులో నివసిస్తున్నారు. వీరి కుమారుడు బీటెక్ పూర్తి చేసి తిరుపతిలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే, సదరు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై గత గురువారం మధుసూదన్ రావు దంపతులు ఆఫీసుకు వెళ్లి ఆరా తీయగా.. కుమారుడి పనితీరు బాగాలేదని, సోమవారం వచ్చి సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలని కంపెనీ వారు సూచించారు.

ఈ పరిణామంతో తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాము లేని సమయంలో కుమారుడి భవిష్యత్తు ఏమవుతుందోనన్న దిగులుతో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సోమవారం మధుసూదన్ రావు సోదరి దొరసానమ్మ ఇంటికి వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో పొరుగువారి సహాయంతో తలుపులు తీయగా.. మధుసూదన్ రావు, రత్నావళి హాల్‌లో, సాయిసుకృత్ దేవుడి గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. మృతుల కాళ్లు, చేతులు కట్టి ఉండటం గమనార్హం.

మధుసూదన్ రావు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘మేం శారీరకంగా, మానసిక బలహీనులమయ్యాం. కుమారుడు అమాయకుడు. అందుకే ముగ్గురం బలవన్మరణానికి పాల్పడుతున్నాం’’ అని అందులో పేర్కొన్నారు. తమ ఆస్తులను ఎవరికి ఎలా పంచాలో లేఖలో వివరించడమే కాకుండా, నెల్లూరు రెడ్‌క్రాస్ సొసైటీకి కొంత స్థలాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాశారు. తమ అంత్యక్రియల ఖర్చు కోసం తన సోదరి ఖాతాలో నగదు జమ చేసినట్లు కూడా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మధుసూదన్ రావు దంపతులకు సొంత సంతానం లేకపోవడంతో, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన సాయిసుకృత్‌ను చిన్నతనంలోనే దత్తత తీసుకుని పెంచారు. అతడిని కష్టపడి బీటెక్ చదివించారు. కుమారుడి ఉద్యోగ సమస్యే కుటుంబం ఆత్మహత్యకు దారితీయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -