వివాహేతర సంబంధాల మోజులో పడి కన్నవారే కిరాతకంగా మారుతున్న ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. అయితే, ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడుపుతో విసిగించాడనే చిన్న కారణంతో మూడేళ్ల స్వంత కొడుకును గొంతు నులిమి హతమార్చిన ఓ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంచలన ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లా బల్‌దేవ్ ఠాణా పరిధిలో గత జూన్ 28న ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మథురకు చెందిన రుచి జిందాల్ (32) అనే వివాహితకు స్థానికంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో జూన్ 28న ఆమె తన ప్రియుడితో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడుతుండగా, ఆమె మూడేళ్ల కుమారుడు పక్కనే ఏడుస్తూ విసిగించాడు. ఫోన్ డిస్టర్బ్ అవుతుందన్న తీవ్ర కోపంతో కన్నతల్లి విచక్షణ కోల్పోయి చిన్నారి గొంతు నులిమి కిరాతకంగా చంపేసింది.
అయితే ఈ హత్యను గుట్టుగా దాచేందుకు ఆమె ప్లాన్ వేసింది. మెడికల్ షాప్ నడుపుతున్న తన భర్తకు ఫోన్ చేసి బాబు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని నమ్మబలికింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అంతకుముందు రోజు చిన్నారికి పోలియో చుక్కలు వేయించడంతోనే రియాక్షన్ వచ్చి చనిపోయాడని కుటుంబసభ్యులను నమ్మిస్తూ ఆమె అందరినీ తప్పుదోవ పట్టించింది.
అయితే సోమవారం రుచి మరోసారి తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ, తాను చేసిన ఈ ఘోర తప్పు గురించి మాట్లాడుతుండగా చాటుగా విన్న భర్త ఖంగుతిన్నాడు. ఆమె నోటి వెంటే నిజం బయటపడటంతో కంగుతిన్న భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు రుచి కాల్‌డేటా రికార్డులను పరిశీలించగా ఆమె పరపురుషుడితో తరచూ మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై నిందితురాలపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సంజీవ్‌కుమార్ రాయ్ తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నామని, వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రియుడి కోసం కన్న కొడుకునే కడతేర్చిన ఈ రాక్షస తల్లి ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
