కుమారుడి ప్రేమ వివాహం ఇష్టం లేని ఓ కసాయి నానమ్మ దారుణానికి ఒడిగట్టింది. కోడలిపై ఉన్న కక్షతో ఏకంగా రెండు నెలల పసికందును ఆసుపత్రి భవనం పైనుంచి కిందకు విసిరేసిన అమానుష ఘటన అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కలకలం రేపింది. ఈ సంచలన ఘటనకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి మీడియాకు వెల్లడించారు.
శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మామిడాకులపల్లికి చెందిన పూజిత, అశోక్‌కుమార్ కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన రెండు నెలల ఆడశిశువుకు పుట్టుకతోనే ఫిట్స్ సమస్య ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం ఈ నెల 21న అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు చిన్నారిని పీడియాట్రిక్ వార్డులో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. అయితే కుమారుడి ప్రేమ వివాహం నచ్చని నానమ్మ సత్యమ్మ కోడలిపై మొదటి నుంచీ కక్ష పెంచుకుంది. ఆపై మనవరాలికి అనారోగ్యం రావడాన్ని కూడా ఆమె జీర్ణించుకోలేకపోయింది.
ఈ క్రమంలో ఈ నెల 27న రాత్రి సమయంలో సత్యమ్మ ఆ పసికందును వార్డు నుంచి బయటకు ఎత్తుకెళ్లి, ఆసుపత్రి రెండో అంతస్తు పైనుంచి కిందకు విసిరేసింది. కొద్దిసేపటి తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ పుటేజీని పరిశీలించగా, నానమ్మే పాపను ఎత్తుకెళ్లినట్లు స్పష్టమైంది. ఆసుపత్రి పరిసరాల్లో గాలించగా ఓపీ గది సమీపంలోని కాలువలో పాప పడిఉంది. అదృష్టవశాత్తూ పైనుంచి పడేటప్పుడు పసికందు కాలువలోని ఖాళీ వాటర్ బాటిళ్లపై పడటంతో పెను ప్రమాదం తప్పింది, ప్రాణాపాయం నుంచి బయటపడింది.
అయినప్పటికీ చిన్నారి నోటి నుంచి కొద్దిగా రక్తం రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై పీఐసీయూకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు తండ్రి, నానమ్మ సత్యమ్మను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రేమ వివాహం కక్షతో పసిప్రాణం తీయబోయిన ఈ రాక్షస నానమ్మ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
