రియాలిటీ షోలు కేవలం వినోదాన్నే కాకుండా, సెలబ్రిటీల జీవితాల్లోని దాగున్న చీకటి కోణాలను, అత్యంత బాధాకరమైన నిజాలను కూడా బయటపెడుతుంటాయి. తాజాగా ప్రముఖ నటి శివాంగి జోషి (Shivangi Joshi) పాపులర్ రియాలిటీ షో ‘లాకప్ 2’ వేదికగా తన చిన్ననాటి బాల్యం తాలూకు భయానక జ్ఞాపకాలను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నమ్మిన బంధువే తనపై ఎలా అఘాయిత్యానికి యత్నించారనే విషయాన్ని కన్నీటిపర్యూరంగా పంచుకున్నారు.
షోలో భాగంగా శివాంగి మాట్లాడుతూ.. తన చిన్నతనంలో జరిగిన దారుణాన్ని బయటపెట్టారు. మావయ్య వరుస అయ్యే ఒక వ్యక్తి ప్రతిరోజూ తనను స్కూల్ నుంచి తీసుకువచ్చేవాడని, తమ కుటుంబం అతడిని ఎంతో గుడ్డిగా నమ్మిందని తెలిపారు. అయితే ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఆ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలని, ఏవేవో మాట్లాడాలని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మానసికంగా వేధించేవాడని వాపోయారు. అసలు ఏం జరుగుతుందో, ఆ వ్యక్తి ఉద్దేశం ఏమిటో ఆ చిన్న వయసులో తనకు అర్థం కాలేదని తెలిపారు. ముఖ్యంగా అమ్మానాన్న ఇంట్లో లేని సమయాన్ని చూసి అతడు లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశాడని కన్నీరుమున్నీరయ్యారు. చివరకు ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో, వారు ఎలాంటి వెనుకంజ వేయకుండా వెంటనే అతడిని ఇంటి నుంచి గెంటేశారని ఆమె వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విచారం వ్యక్తమైంది. దీనిపై శివాంగి తల్లి స్పందిస్తూ.. నేటి సమాజంలో పిల్లల రక్షణ ఎంతో కీలకమని అన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించిన అవగాహనను తప్పనిసరిగా కల్పించాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాంగి జోషి.. పాపులర్ షో ‘బాలికా వధు 2’ (Balika Vadhu 2)లో ఆనంది పాత్రతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే.
