వర్ష కాలం వచ్చిందంటే చాలు.. ఆ పిల్లల చదువుల ప్రయాణం ఒక సాహస యాత్రను తలపిస్తుంది. పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలంటే ప్రతిరోజూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని నదిని దాటాల్సిందే. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ పసికందుల ఆవేదన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
కొమరాడ మండలం గుండా ప్రవహిస్తున్న నాగావళి నది వల్ల ఆ మండలం రెండుగా విడిపోయింది. నదికి అవతలి వైపు ఉన్న దాదాపు 8 గ్రామాల ప్రజలు, విద్యార్థులు నిత్యం మండల కేంద్రానికి రావాలంటే ఈ నాగావళి నదినే ఏకైక మార్గంగా ఎంచుకోవాల్సి వస్తోంది. అయితే, వర్షాలు కురిసినప్పుడు నది ఉప్పొంగి ప్రవాహం తీవ్ర రూపం దాలుస్తోంది.
మండల కేంద్రంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి నాగావళి నదిని దాటుతున్నారు. సాధారణ రోజుల్లో నాటు పడవల ద్వారా ప్రయాణించే వీరికి ఇటీవల ఆ పడవ కూడా మరమ్మతులకు గురికావడంతో తిప్పలు మరింత ఎక్కువయ్యాయి. తీవ్రమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ వేరే మార్గం లేక పసిపిల్లలు సహా విద్యార్థులంతా లోతైన నీటిలోకి దిగి..ఒకరి చేయి ఒకరు పట్టుకుని అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిసారీ వర్షాలు పడినప్పుడు మా చదువులు ఆగిపోయే పరిస్థితి వస్తోంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నీళ్లలో నడవడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది” అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఈ రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాగావళి నదిపై తక్షణమే ఒక వారధి (బ్రిడ్జి) నిర్మించాలని లేదా కనీసం సురక్షితమైన ప్రయాణ సదుపాయాలను కల్పించాలని 8 గ్రామాల ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వాన్ని…జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
