తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో సంచలనం సృష్టించే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తన మనసులో ఒక ప్రత్యేకమైన కోరిక ఉందన్న ఆయన, దానికి సంబంధించిన వివరాలను నవంబరులో వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు మరియు తన భవిష్యత్ ప్రణాళికలపై పలు కీలక విషయాలను పంచుకున్నారు.నా మనసులో రాజకీయంగా ఒక బలమైన కోరిక ఉంది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి అవసరమైన కార్యాచరణ మరియు పొలిటికల్ డిజైన్ కూడా నా వద్ద సిద్ధంగా ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో (నవంబరు నాటికి) నా రాజకీయ బాధ్యతలపై పూర్తి స్పష్టత వస్తుంది. అప్పుడే ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తా అని తెలిపారు.
సుమారు మూడున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జరిగిన భేటీని గుర్తుచేస్తూ… పార్టీ, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలపై మీడియా ముందు బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ తనకు సూచించినట్లు చెప్పారు. పార్టీలో ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయభేదాలు ఉంటే నేరుగా ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారమే నేను ఇప్పటివరకు ఓపెన్‌గా ఏమీ మాట్లాడటం లేదు. ఏమైనా చెప్పాలనుకుంటే ముందుగా రాహుల్‌ను కలిశాకే బయట మాట్లాడతా అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశాలకు హాజరుకాకపోవడంపై స్పందిస్తూ… పీఏసీ మీటింగ్స్‌లో మాట్లాడే అంతర్గత విషయాలు, చర్చలు బయటకు లీక్ అవుతున్నాయి. పార్టీ క్రమశిక్షణ దెబ్బతినేలా అంతర్గత అంశాలు బయటకు రావడం సరికాదనే ఉద్దేశంతోనే నేను పీఏసీ సమావేశాలకు వెళ్లడం మానేశాను. ఒకవేళ వెళ్తే పార్టీలోని అంతర్గత వ్యవహారాలను ఏఐసీసీ ఇన్‌చార్జి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేవాడిని అని తెలిపారు.
