ఒడిశాలో దశాబ్దాల క్రితం జరిగిన ఓ ట్రిపుల్ మర్డర్ (ముగ్గురి హత్య) కేసులో తప్పుడు అభియోగాలతో సుమారు 22 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఆయనపై ఎలాంటి బలమైన, నమ్మదగిన సాక్ష్యాధారాలు లేనప్పటికీ రెండు దశాబ్దాలకు పైగా స్వేచ్ఛను కోల్పోవడం దేశ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమిష్టి వైఫల్యం (Collective Failure) అని అత్యున్నత ధర్మాసనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు నిందితుడిని అన్ని అభియోగాల నుంచి పూర్తిగా నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 2004లో ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ముగ్గురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో అర్జున్ జాని (Arjun Jani) అనే వ్యక్తిని పోలీసులు అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా ఆయన నుంచి నేరాన్ని అంగీకరింపజేసే ప్రయత్నం చేశారు. ఆ తప్పుడు వాంగ్మూలమే ప్రాసిక్యూషన్ కేసుకు ప్రధాన ఆధారంగా మలచి, ఆయనకు కింది కోర్టులో శిక్ష పడేలా చేసింది. ఎలాంటి న్యాయపరమైన పటిష్టమైన ఆధారాలు లేకుండానే పోలీసులు కేవలం అనుమానంతో అరెస్ట్ చేయడం వల్ల అమాయకుడైన వ్యక్తి జీవితంలో విలువైన 22 ఏళ్లు కటకటపాల వెనకే కరిగిపోయాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది.
ఈ కేసును పూర్తిగా పునఃపరిశీలించిన సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్, ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో పూర్తిగా విఫలమైందని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు సాక్ష్యాధారాలను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమవ్వగా, ఒడిశా హైకోర్టు కూడా కేవలం సాంకేతిక కారణాల (జాప్యం) పేరుతో అప్పీళ్లను కొట్టివేస్తూ మూగ ప్రేక్షక పాత్ర పోషించిందని తీవ్రంగా విమర్శించింది. చివరకు 22 ఏళ్ల సుదీర్ఘ నరకం తర్వాత అర్జున్ జానికి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, బాధితుడికి సమాజంలో పునరావాసం కల్పించేలా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని, లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది.
