మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించిన ఏ చిన్న వార్తయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా ఆయనకు సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారంటూ గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చిరంజీవిని ఈ బాధ్యత కోరిందంటూ పలు మాధ్యమాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలన్నింటినీ చిరంజీవి అధికారిక టీమ్ తాజాగా ఖండించింది.
అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసిన మెగాస్టార్ టీమ్, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అవాస్తవ ప్రచారాలను అభిమానులు, ప్రజలు నమ్మవద్దని కోరింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్లారిటీ ఇవ్వడంతో ఆ ఫేక్ న్యూస్‌కు చెక్ పడినట్లయింది. సినిమాల విషయానికి వస్తే.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఏమాత్రం జోరు తగ్గించని చిరు, వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘మెగా 158’ (Mega 158) సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
అలాగే వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిరు బర్త్‌డే నాడే వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలే కాకుండా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనూ చిరు ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చిరంజీవి ఫుల్ జోరు మీదున్నారు.
