‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 24న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
‘‘ఇగ నుంచి ఈ జాగ ఎవరిదీ.. ఈ దేశం ఎవరిదీ’’ అంటూ జడల్‌గా నాని చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం హింస, రక్తపాతంతో హై-వోల్టేజ్‌గా సాగింది. అణగదొక్కబడిన ఓ జాతికి నాయకుడైతే, కాకుల్లా చిన్నచూపు చూసిన తమ సమూహంతో కలిసి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌పై ఈ కథ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంట్లో నాని కొత్త మేకోవర్, ఆయన చెప్పిన మాస్ డైలాగ్‌లు, మోహన్‌బాబు వింటేజ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ‘‘తూ అనిపించుకున్న కాకులు తల్వార్‌లు పడితే ఏమైతదో చూపిద్దాం’’ అనే డైలాగ్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
అయితే, ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయని కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. టీజర్‌లో హింస, రక్తపాతం మోతాదు కాస్త ఎక్కువగా ఉందని, అలాగే అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత హై ఇచ్చేలా ఉండాల్సిందంటూ కొందరు అభిప్రాయపడ్డారు. హిందీ డబ్బింగ్ వాయిస్ సరిగ్గా సెట్ కాలేదని కొందరు కామెంట్లు చేశారు. ఏదేమైనా, రగ్డ్ అండ్ ఫెరోషియస్ లుక్‌తో నాని చేస్తున్న ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
