- Advertisement -

రేణుకాస్వామి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

- Advertisement -

కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A14 (14వ నిందితుడు)గా ఉన్న దర్శన్ అత్యంత నమ్మకమైన అనుచరుడు ప్రదోష్.. అప్రూవర్‌గా (రాష్ట్ర సాక్షిగా) మారారు. ఈ మేరకు కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో హత్య జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందనే దానిపై పూసగుచ్చినట్లు బయటపెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటన జరిగిన నాటి నుంచి ఆధారాలను ఎలా తారుమారు చేశారనే ప్రతి అంశాన్ని ఆయన తన పిటిషన్‌లో కుండబద్దలు కొట్టారు.

ప్రదోష్‌ కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లోని వివరాల ప్రకారం.. పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడనే కోపంతో రేణుకాస్వామిని దర్శన్‌ విచక్షణారహితంగా నిలదీశారు. ఆ సమయంలో తీవ్ర పదజాలంతో దూషిస్తూ బాధితుడిపై భీకరంగా దాడికి దిగారు. ఆ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే.. రేణుకాస్వామి తల నుంచి ధారగా రక్తం కారడం తాను స్వయంగా చూశానని ప్రదోష్ వెల్లడించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతానికి పవిత్ర గౌడను కూడా పిలిపించి, ఆమె చేత రేణుకాస్వామిని చెప్పుతో కొట్టేలా చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా దారుణమైన హింస కొనసాగిందని, బాధితుడి శరీరంపై లోదుస్తులు మాత్రమే ఉంచి, టాటా ఏస్‌ వాహనానికి వేలాడదీసి నైలాన్ తాళ్లతో దారుణంగా కొట్టారని తెలిపారు.

ఈ హింసాకాండ చూసి చలించిపోయిన ప్రదోష్.. ‘‘ఇంత దారుణంగా కొడితే అతడు చనిపోతాడు, ఆపేయండి’’ అంటూ దర్శన్‌ను వారించే ప్రయత్నం చేశారట. కానీ, అక్కడున్న వారెవరు తన మాటలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. బాధితుడికి కాస్త ఆహారం, నీళ్లు ఇచ్చినప్పటికీ దర్శన్ క్రూరత్వం తగ్గలేదని తెలిపాడు. నేరుగా రేణుకాస్వామి ఛాతీ, మెడపై తన కాలితో గట్టిగా తన్నడంతో బాధితుడు స్పృహ కోల్పోయి కిందపడిపోయాడని పిటిషన్‌లో వివరించారు. ఆ వెంటనే దర్శన్ తన రెండు కాళ్లతో బాధితుడి ఛాతీపై నిలబడి తొక్కేందుకు తీవ్రంగా యత్నించగా, తాను వెంటనే జోక్యం చేసుకుని ఆయన్ను పక్కకు లాగినట్లు ప్రదోష్ సంచలన నిజాలు బయటపెట్టారు.

కొద్దిసేపటి తర్వాత రేణుకాస్వామి మృతి చెందినట్లు గుర్తించామని.. ఆ సమయంలో దర్శన్ తీవ్ర భయాందోళనకు గురయ్యారని ప్రదోష్ తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కితే తన కెరీర్ సర్వనాశనం అవుతుందని ఆందోళన చెందారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ విషయాన్ని ఇక్కడితో సర్దుబాటు చేయకపోతే తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ తనను బెదిరించినట్లు ప్రదోష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాతే అసలు నిజాన్ని దాచిపెట్టి, ఈ హత్యను ఆత్మహత్యగానో లేక వేరే విధంగానో నమ్మించేందుకు ఒక కల్పిత కథను సృష్టించేందుకు అంతా కలిసి చర్చలు జరిపినట్లు బాంబ్ పేల్చారు.

ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన ప్రతీ ఒక్క నిజాన్ని, లోపలి విషయాలను న్యాయస్థానం ముందుంచానని ప్రదోష్ తెలిపారు. అయితే, ఈ సంచలన నిజాలు బయటపెట్టిన నేపథ్యంలో తనకు ఇతర నిందితుల నుంచి ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందని, తన రక్షణ కోసం జైలులో ఇతర ఖైదీలతో కాకుండా ప్రత్యేక సెల్‌లో ఉంచాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రదోష్ వేసిన ఈ పిటిషన్ న్యాయవర్గాల్లోనూ, కన్నడ సినీ పరిశ్రమలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పిటిషన్‌పై కోర్టు త్వరలోనే విచారణ జరిపి తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ పరిణామం విచారణలో ఎలాంటి కీలక మలుపు తిప్పుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -