- Advertisement -

దారుణం.. అమ్మాయి తండ్రిని చంపిన అబ్బాయి తండ్రి!

- Advertisement -

జనగామ జిల్లా చిల్పూర్‌కు చెందిన పోలు వెంకటేశ్వర్లు (45) హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌ ఊర చెరువు శివారులో సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. కాజీపేట సీఐ శ్యాంసుందర్ వివరాల ప్రకారం ఈ ఘటనకు పాతకక్షలే కారణమని తేలింది. వెంకటేశ్వర్లు, రాజమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు రమ్య.. పక్కింటి అంబటి పరమేశ్వర్ కొడుకు వినయ్‌ని 2022లో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే మనస్పర్థల కారణంగా 2023లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఈ విడాకుల విషయమై వెంకటేశ్వర్లుకు, వినయ్ తండ్రి పరమేశ్వర్‌కు మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. గతంలో పెద్ద మనుషుల సమక్షంలోనే పరమేశ్వర్ బ్లేడ్‌తో వెంకటేశ్వర్లు మెడను కోయడానికి ప్రయత్నించాడు. స్థానికులు అప్పట్లో ఆ గొడవను అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య కక్షలు మరింత పెరిగాయి. ఎలాగైనా వెంకటేశ్వర్లును అడ్డుతొలగించుకోవాలని పరమేశ్వర్ ముందస్తు ప్లాన్ వేసుకున్నాడు.

సోమవారం రాత్రి 7:45 గంటల సమయంలో వెంకటేశ్వర్లు ఇంట్లో భోజనం చేస్తుండగా చిల్పూర్‌కు చెందిన దామెర సంపత్ అక్కడికి వచ్చాడు. గొడవ గురించి మాట్లాడాలని, పరమేశ్వర్ పిలుస్తున్నాడని చెప్పి వెంకన్నను బయటకు తీసుకెళ్లాడు. రాత్రి 11:30 దాటినా ఆయన ఇంటికి రాలేదు. దీంతో భార్య రాజమణి సంపత్ ఇంటికెళ్లి చూడగా ఎవరూ లేరు. సంపత్‌కు ఫోన్ చేయగా, మాట్లాడిన తర్వాత గ్రామ పంచాయతీ వద్ద దింపి వెళ్లానని చెప్పాడు. మంగళవారం ఉదయం రాంపూర్‌ చెరువు శివారులోని మడేలయ్య గుడి వద్ద వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురైనట్లు సమాచారం అందింది.

అంబటి పరమేశ్వర్, సంపత్ కలిసి ముందస్తు పథకం ప్రకారమే వెంకటేశ్వర్లును కత్తితో గొంతు కోసి, తలపై కొట్టి హత్య చేశారని పోలీసులు తేల్చారు. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ శ్యాంసుందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ హత్యలో ముగ్గురు నుంచి ఐదుగురు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడు అదుపులో ఉన్నట్లు సమాచారం. చిల్పూర్‌లో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -