కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును ఈ ఏడాది ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. ఖేల్‌రత్న అవార్డు కోసం స్టార్ హాకీ క్రీడాకారుడు హార్దిక్ సింగ్ పేరును పరిశీలించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ రేసు నుంచి చివరకు వైదొలిగారు.
ఈ ఏడాది వివిధ క్రీడా విభాగాలకు సంబంధించి మొత్తం 17 మందిని ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డులు’ వరించాయి. వివిధ రంగాల్లో రాణించిన క్రీడాకారులను ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించింది. అవార్డు గ్రహీతల వివరాలు ఇలా ఉన్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి ఎంపికయ్యారు. బ్యాడ్మింటన్‌లో ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ దక్కించుకున్నారు. బాక్సింగ్‌లో నరేందర్ బెర్వాల్, చెస్‌లో విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఇక హాకీ నుంచి లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్‌లకు అవార్డు దక్కింది. కబడ్డీలో సుర్జీత్, పూజ ఎంపికయ్యారు. పారా-షూటింగ్ విభాగంలో ధనుష్ శ్రీకాంత్, రుద్రాంశ్ ఖండేల్వాల్ పురస్కారాలు దక్కించుకున్నారు. పారా-అథ్లెటిక్స్‌లో ఏక్తా భ్యాన్, రోయింగ్‌లో అరవింద్ సింగ్, షూటింగ్‌లో అఖిల్ షియోరాన్ అవార్డులకు ఎంపికయ్యారు. అలాగే లైఫ్‌టైమ్ కేటగిరీలో ఫుట్‌బాల్ క్రీడాకారుడు అరుమై నాయగమ్‌కు అర్జున అవార్డు ప్రకటించారు.
ఈ ఏడాటికి గాను కోచ్‌లకు అందించే ద్రోణాచార్య అవార్డులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. రెగ్యులర్ కేటగిరీలో ఛోటే లాల్ యాదవ్ (బాక్సింగ్), పర్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), నేహా నందకుమార్ చవాన్ (షూటింగ్) అవార్డులు గెలుచుకున్నారు. అదేవిధంగా లైఫ్‌టైం కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) కోచ్‌లను ద్రోణాచార్య పురస్కారాలు వరించాయి.
