- Advertisement -

రాష్ట్రంలో విచ్చలవిడిగా మాఫియా, గంజాయి: జ‌గ‌న్

- Advertisement -

కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మంటగలిశాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు, వేధింపులతో పాటు రకరకాల మాఫియాలు యథేచ్ఛగా నడుస్తున్నాయని మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అంతా మాఫియా రాజ్యమే నడుస్తోందని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. అమరావతి పేరుతో భారీ బిల్డింగ్‌ల స్కామ్ నడుస్తోందని, విలువైన భూములను అడ్డగోలుగా కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. వీటితో పాటు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు, కల్తీ మద్యం విచ్చలవిడిగా ప్రతీచోటా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని జగన్ అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే స్వయంగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మత్తులో తూలుతూ పోలీసులే కారుతో యాక్సిడెంట్ చేసి ప్రజలకు దొరికిపోయారని గుర్తుచేశారు. ఆ కారులో గంజాయి, మద్యం బాటిళ్లు, ఖాకీ యూనిఫామ్స్ దొరికాయని తెలిపారు. డ్రైవర్‌తో సహా మరో ఇద్దరు పోలీసులు పూర్తిగా మత్తులోనే ఉన్నారని చెప్పారు.

అక్కడికి వచ్చిన సీఐ.. వీడియోలు తీస్తున్న ప్రజలను బెదిరించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ఎవరిని నమ్మాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. అద్దంకి ఘటనను కవర్ అప్ చేయడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారని విమర్శించారు. పోలీసు అధికారుల ప్రకటనలకు, ఎఫ్‌ఐఆర్‌కు అసలు పొంతనే లేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీమయంగా, గంజాయిమయంగా మారిందని జగన్ దుయ్యబట్టారు. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు, పెదబాబుకి ఇంత అంటూ వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోందని, అదే గంజాయి అని తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -