అతిగా ఆలోచించ‌కురా.. ‘అనుమాన పక్షి’!

రాగ్‌మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. ఇది పూర్తిగా విభిన్నమైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్ ‘డీజే టిల్లు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన విమల్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్‌ చిలక, రాజేశ్‌ జగ్తియాని, హీరాచంద్‌ దండ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రతి చిన్న విషయానికి విపరీతంగా అనుమానపడే ఒక వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ వ్యక్తి పెట్టే అనుమానాలతో అతడు, అలాగే అతని చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎలాంటి నవ్వులు పూయించారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌లోని కామెడీ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

ఈ చిత్రంలో రాగ్‌మయూర్‌తో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, సీనియర్ నటుడు బ్రహ్మాజీ, అజయ్, మస్త్‌ అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విమలకృష్ణ టేకింగ్, విభిన్నమైన కథాంశం ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.