వేట కొడవళ్లతో వెంబడించి రౌడీషీటర్ హత్య!

హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగు చూసింది. పాత కక్షల నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని వేట కొడవళ్లు, కత్తులతో వెంటాడి మరీ అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్‌గా గుర్తించారు. బండ్లగూడ ప్రాంతంలో దుండగులు తనను వెంబడించడంతో భయపడిపోయిన నయీమ్, ప్రాణభయంతో అక్కడే ఉన్న ‘సుప్రీం వన్స్’ షాపులోకి పరుగెత్తి తలదాచుకున్నాడు.

అయినప్పటికీ వదిలిపెట్టని హంతకులు షాపులోకి చొరబడి కత్తులు, వేట కొడవళ్లతో నయీమ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నిందితులు వెంటనే ఒక కారులో ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది పాత కక్షల కారణంగానే జరిగిన హత్యగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.