సీఎం రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. కేవలం 30 రోజుల్లోగా ఈ విచారణ పూర్తి చేసి నిజాలు నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్‌కు నిజంగానే 700 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత రావాలన్నారు. ఆ ఫామ్‌హౌస్‌లో ఏకంగా 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు దాచిపెట్టారని ఆయన నిలదీశారు. ఆ ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుని నిరుపేదలకు పంచిపెడతామని సీఎం తేల్చిచెప్పారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల భూముల వివరాలను సీఎం బహిర్గతం చేశారు. సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబానికి 67.5 ఎకరాలు ఉందని తెలిపారు. కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు, సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు ఉన్నాయన్నారు. మొత్తం మీద కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో కలిపి 439 ఎకరాలు ఉన్నాయని వివరించారు. గంగుల, ఎర్రబెల్లి, సుధీర్ రెడ్డి కలిసి 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు. జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లోని 50 ఎకరాల్లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి కుష్కి పొలం 54 ఎకరాలు, తరి పొలమైతే 27 ఎకరాలు మాత్రమే ఉండాలని గుర్తుచేశారు.

రాష్ట్రంలో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ భారీ భూ కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేకంగా ‘స్పెషెల్ ఎంక్వయిరీ టీమ్’ (SET) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం నెల రోజుల్లోనే ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలను వెలికితీస్తామని చెప్పారు. ఇప్పటివరకు ధరణి పార్ట్-1 అక్రమాలే బయటపెట్టామని, త్వరలోనే ధరణి పార్ట్-2 అక్రమాలను కూడా సభలో బయటపెడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ సభ్యులు సభకు వచ్చి తన కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం చేయాలని సవాల్ విసిరారు. ధరణిని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైపవర్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వారంలోపు సమగ్ర మార్గదర్శకాలు తీసుకువచ్చి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. మరోవైపు ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీవో 118 పరిధిలోని బాధితులకు త్వరలోనే శుభవార్త చెబుతామన్నారు. అక్కడ పెండింగ్‌లో ఉన్న 9,500 మందికి పైగా బాధితుల దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి స్థలాలను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.