యూట్యూబర్‌ వైష్ణవి భర్త హత్య!

ప్రేమ వివాహం చేసుకున్న భార్యను గర్భిణి అని కూడా చూడకుండా కడతేర్చిన భర్త, ఆరు నెలల తిరగకుండానే ప్రత్యుత్తరంగా దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్‌కు చెందిన వైష్ణవి ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక స్వీపర్లుగా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. 14 నెలల క్రితం పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. అయితే కొద్ది నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ ఏడాది మార్చి 16న నాలుగు నెలల గర్భిణి అయిన వైష్ణవిని భర్త హరిబాబు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో హరిబాబుతో పాటు అతని తల్లి, ఇద్దరు అన్నలు జైలుపాలయ్యారు.

వైష్ణవి కుటుంబంలో అందరికంటే చిన్నది, ఏకైక ఆడపిల్ల కావడంతో అందరికీ ఆమెంటే ఎంతో ప్రాణం. ఎంతో గారాబంగా పెంచుకున్న చెల్లి దారుణ హత్యకు గురికావడాన్ని ఆమె సోదరులు జీర్ణించుకోలేకపోయారు. చట్టం ద్వారా హరిబాబుకు సరైన శిక్ష పడకపోతే తామే స్వయంగా అంతం చేస్తామని వారు గతంలోనే ప్రతినబూనారు. కుటుంబంలో పెద్దమ్మలు, చిన్నమ్మల కుమారులతో కలిపి ఆమెకు మొత్తం 13 మంది సోదరులు ఉన్నారు. చెల్లి మరణంతో ఆ కుటుంబం తీవ్ర క్షోభను అనుభవించింది.

ఈ క్రమంలో జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు, నిజామాబాద్‌లోని ఇంద్రాపూర్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. రాజరాజేంద్ర చౌరస్తాలో మక్కబుట్టలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రోజున మక్కబుట్టలు అమ్ముకుంటున్న సమయంలో కొందరు దుండగులు కారులో వచ్చి అతనిపై అటాక్ చేశారు. కేవలం 10 సెకన్లలోనే ఒక వ్యక్తి పదునైన ఆయుధంతో హరిబాబు తలపై 9 సార్లు విచక్షణారహితంగా నరికి చంపాడు. ఈ భయానక దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

తన చెల్లి హత్యకు ప్రభుత్వాలు న్యాయం చేయలేదని, అందుకే తానే స్వయంగా హరిబాబును అంతం చేశానని వైష్ణవి అన్న సంతోష్‌ సోషల్‌ మీడియాలో ఒక వీడియో విడుదల చేయడం తీవ్ర కలకలం రేపింది. తాను పోలీసులకు లొంగిపోతున్నానని, తనకు శిక్ష పడకుండా ప్రజలు మద్దతు తెలపాలని ఆ వీడియోలో సంతోష్‌ కోరాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలో జరిగిన ఈ రెండు హత్యలు రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని, తీవ్ర చర్చను నింపాయి.