దానం నాగేందర్‌.. నెక్స్ట్ కడియం శ్రీహరి?

పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు వేసిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పరిణామంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఈ ఇద్దరిపై గతంలో అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇద్దరి వాదనలు విన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ గత మార్చి 11న ఆ పిటిషన్లను కొట్టివేశారు. ఫిరాయింపునకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ అప్పట్లో ఆ కేసులను ముగించారు. అయితే స్పీకర్‌ తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సెప్టెంబర్‌ 18న స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ, ఆయన సభ్యత్వం 2024 ఏప్రిల్‌ 23 నుంచే రద్దయినట్లు తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గురువారం ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో దానం అనర్హత ఖాయమైంది. సరిగ్గా అదే రోజు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌ విషయంలోనూ రాబోయే న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయనే చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

2023 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఆ తర్వాత 2024 మార్చి 31న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా గెలిచారు. కడియం శ్రీహరి పార్టీ మారడం, కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయడం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు తమ ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు దానం ఉదంతం నేపథ్యంలో కడియం భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.