ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తంచేయడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై రాజీనామా ఒత్తిడి మరింత పెరిగింది. విపక్షాలు ఆయనపై అభిశంసనకు సిద్ధమవుతుండగా, కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంటు ఉభయసభల్లో మరోసారి అభిశంసన నోటీసులు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లోనూ 73 మంది సభ్యులతో నోటీసు ఇచ్చినప్పటికీ, తాజాగా సర్ వివాదం నేపథ్యంలో వచ్చేవారంలోగా మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకపోతే దిల్లీలో ‘జంతర్ మంతర్ 2.0’ నిరసన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరించింది. సర్ రికార్డులన్నింటినీ సుప్రీంకోర్టుకు సమర్పించాలని, సీఈసీపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది.
ఈ అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. భారతీయ ఓటర్ల వ్యవస్థను ధ్వంసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ వెంటనే రాజీనామా చేసి అప్రూవర్‌గా మారి నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షాల పాలనపై ప్రజా వ్యతిరేకత ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం రిగ్గింగ్ జరిగిందని తాము భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జోరందుకున్నాయి. శుక్రవారం అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘం కార్యాలయాలకు మార్చ్‌లు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆదేశించింది. సీఈసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే 5 లెఫ్ట్ పార్టీలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా నేరుగా పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో సీఈసీపై ఫిర్యాదు చేశారు.

