టీమిండియాతో జరగబోయే కీలకమైన వన్డే సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ట్రోఫీలు సాధించాలంటే ముందుగా భారత్‌ను చావుదెబ్బ కొట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలిచి ఏకంగా 24 ఏళ్లు అవుతోందని గుర్తుచేశారు. ఈసారైనా తమ జట్టుపై గెలిచేందుకు అద్భుతమైన అవకాశముందని సామీ ధీమా వ్యక్తం చేశారు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే భారత్ వంటి బలమైన జట్లను అడ్డుకునే రీతిలో తమ ఆటతీరు ఉండాలని సామీ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో తమ జట్టు కచ్చితంగా అర్హత సాధిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ప్రస్తుతం తమ జట్టులో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారని కొనియాడారు.
షెయ్ హోప్‌తో పాటు అమీర్ జంగూ, రూథర్‌ఫోర్డ్, అల్జారీ జోసెఫ్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో తమ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోందని సామీ చెప్పారు. వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న టీమిండియాను ఈసారి సిరీస్‌లో నేలమట్టం చేసి ట్రోఫీతో ఇంటికి వెళతామని హెచ్చరించారు. ఐపీఎల్ ఆడటం వల్ల తమ ప్లేయర్లకు భారత పిచ్‌లు, పరిస్థితులపై మంచి అనుభవముందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో తొలి వన్డేకు కేవలం ఒక్క రోజే సమయం ఉన్న తరుణంలో సామీ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
కాగా, భారత గడ్డపై వెస్టిండీస్ జట్టు చివరిసారిగా 2002లో మాత్రమే వన్డే సిరీస్ గెలిచింది. అప్పట్లో కార్ల్ హూపర్ కెప్టెన్‌గా ఉండగా, సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియాపై విండీస్ 4-3 తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నోసార్లు భారత్‌లో పర్యటించినప్పటికీ విండీస్ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేకపోయింది.
భారత్ – వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే తిరువనంతపురంలో, రెండో మ్యాచ్ గౌహతిలో సెప్టెంబర్ 30న, చివరి మ్యాచ్ అక్టోబర్ 3న న్యూ ఛండీఘర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ బరిలోకి దిగుతుండటం విశేషం. వన్డేల తర్వాత అక్టోబర్ 6 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

