‘ది ప్యారడైజ్‌’ సినిమా టాక్.. స్పందించిన నాని!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న రివ్యూలు, ప్రేక్షకుల స్పందనలపై హీరో నాని తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘ది ప్యారడైజ్‌’ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న స్పందనను, అభిప్రాయాలను తాను పూర్తిగా గమనించినట్లు నాని తెలిపారు. అభిమానులు తమపై కురిపిస్తున్న అపారమైన ప్రేమతో పాటు, సోషల్ మీడియాలో వస్తున్న సరదా ట్రోల్స్‌ను కూడా తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ సినిమాను తమ సొంత చిత్రంగా ప్రేక్షకులు స్వీకరించిన తీరు తన హృదయానికి హత్తుకుందని భావోద్వేగానికి గురయ్యారు.

అదే సమయంలో సినీ విమర్శకులు, రివ్యూవర్లు ఎత్తి చూపిన పొరపాట్లు, లోటుపాట్లను కూడా తాము సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటామని నాని స్పష్టం చేశారు. సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా రక్తం, చెమట చిందించి ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఈ సినిమాను తీర్చిదిద్దామన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఘనంగా సంబరపడవచ్చు, లేదా తమదైన శైలిలో విమర్శించవచ్చని నాని పేర్కొన్నారు.

సినిమాపై ప్రేక్షకులు చూపించిన ఉత్సాహం, తనపై కురిపించిన ప్రేమ తనలో ఎంతో కృతజ్ఞతా భావాన్ని నింపాయని నాని తెలిపారు. సినిమాపై వస్తున్న ప్రశంసలకు, విమర్శలకు అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ది ప్యారడైజ్‌’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నాని కెరీర్‌లోనే ఇవి ఆల్ టైమ్ రికార్డు స్థాయి కలెక్షన్స్ కావడం విశేషం. కలెక్షన్ల పరంగానూ, ప్రేక్షకుల స్పందన పరంగానూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది