తాగుబోతులకు సరికొత్త రోల్ మోడల్..

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంచీలోని ఓర్మాంజి ప్రాంతంలో సెప్టెంబర్ 26న చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఆడ కోతి నేరుగా స్థానిక వైన్ షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. షాప్‌లోని బీర్లు, మద్యం బాక్సులెక్కి హల్ చల్ చేసింది.

అంతటితో ఆగకుండా ఒక వోడ్కా బాటిల్‌ను ఓపెన్ చేసి అందులోని మద్యాన్ని తాగింది. ఆ తర్వాత మత్తు ఎక్కడంతో అక్కడే మద్యం కార్టన్ల మీద నిద్రపోయింది. షాప్ సిబ్బంది ఆ కోతిని బయటకు తరిమేందుకు ప్రయత్నించగా, అది కాస్తా షాప్ యజమానిని కరిచింది. గర్భిణిగా ఉన్నట్లు చెబుతున్న ఆ కోతి మద్యం సేవించి అలా నిద్రపోవడంతో అక్కడివారంతా అవాక్కయ్యారు.

ఈ వింత ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుంది. ఎంతో జాగ్రత్తగా ఆ కోతిని సురక్షితంగా బయటకు వెలికితీశారు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ @Rainmaker1973 షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. పట్టణ ప్రాంతంలో కోతి చేసిన ఈ ఊహించని ‘షాపింగ్’ ట్రిప్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.