కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ బంపర్ లాటరీ ఫలితాలు వెలువడ్డాయి. ఈ డ్రాలో టీఎల్ 360615 (TL 360615) నంబరు గల టికెట్‌కు మొదటి బహుమతి లభించింది. ఏకంగా రూ.30 కోట్ల భారీ జాక్‌పాట్ విజేతను వరించింది. అయితే ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు.
ఈ జాక్‌పాట్ టికెట్‌ను కన్నూర్‌కు చెందిన ముత్తు లాటరీ ఏజెన్సీ విక్రయించింది. ఈ సంస్థ నిర్వాహకుడు అనీశ్ తాలిపరంబ ప్రాంతంలో విజేతకు దీనిని అమ్మారు. గతంలో క్రిస్మస్ – నూతన సంవత్సర బంపర్ లాటరీలోనూ మొదటి బహుమతి తాలిపరంబలోనే అమ్మిన టికెట్‌కు రావడం విశేషం. లాటరీ టికెట్ల విక్రయ రంగంలో అనీశ్‌కు దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.
ఈ ఓనం లాటరీలో రెండో బహుమతి కింద మొత్తం 20 మంది విజేతలను ఎంపిక చేశారు. ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున బహుమతి అందుతుంది. ప్రతి సిరీస్ నుంచి ఇద్దరు చొప్పున విజేతలకు ఈ మొత్తం దక్కుతుంది. ప్రథమ బహుమతి గెలుచుకున్న వ్యక్తికి ఏజెన్సీ కమిషన్, ప్రభుత్వ పన్నుల కోత తర్వాత సుమారు రూ.16.47 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతాయి.
కేరళ రాష్ట్ర లాటరీ చరిత్రలోనే ఈసారి సరికొత్త రికార్డు నమోదైంది. ముద్రించిన ఓనం బంపర్ టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడైపోవడం ఇదే మొదటిసారి. మార్కెట్‌లోకి విడుదల చేసిన మొత్తం 90 లక్షల టికెట్లు పూర్తిగా విక్రయమయ్యాయి. దీనితో దాదాపు రూ.450 కోట్ల మేర భారీ టర్నోవరు నమోదైంది. ఈ టికెట్ల అమ్మకాల ద్వారా కేరళ ప్రభుత్వ ఖజానాకు రూ.241.20 కోట్లకు పైగా భారీ ఆదాయం లభించింది.

