అమెరికాకు హెచ్చరికలు జారీ చేసేందుకు ఇరాన్ మరోసారి తెలుగు సినిమాను వేదికగా ఎంచుకుంది. ఇటీవల రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ యాక్షన్ దృశ్యాలను ఉపయోగించి తన సందేశాన్ని వినిపిస్తోంది. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ కొద్దిరోజుల క్రితం బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని ఫైట్ సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో హీరో విలన్లను తుదముట్టించే దృశ్యాలు ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మరో అడుగు ముందుకేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సంచలన చిత్రం ‘బాహుబలి’లోని యుద్ధ సన్నివేశాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసింది. కాలకేయుల సైన్యంపై అమరేంద్ర బాహుబలి ఒంటిచేత్తో విరుచుకుపడే దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
ఈ పోస్టుకు ఇరాన్ ఎంబసీ ఓ శక్తిమంతమైన వ్యాఖ్యను జత చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తమ దేశ అధ్యక్షుడు డాక్టర్ పెజెష్కియాన్ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసింది. ‘‘మేం ఎవరి ముందూ తలవంచే ప్రసక్తే లేదు. ఎవరికీ మోకరిల్లబోము’’ అని తమ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పినట్లు పేర్కొంది.
కాలకేయుల అరాచకాలను ఎదుర్కొని నిలబడిన బాహుబలి తరహాలోనే తాము కూడా పోరాడతామని తెలిపింది. తమ మాతృభూమి రక్షణ కోసం రక్తం చిందించడానికైనా, ప్రాణత్యాగం చేయడానికైనా వెనుకాడబోమని ఇరాన్ స్పష్టం చేసింది. రాజకీయ, దౌత్యపరమైన హెచ్చరికల కోసం తెలుగు సినీ విజువల్స్‌ను ఇరాన్ వరుసగా వినియోగిస్తుండటం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియో క్లిప్‌ను తెగ షేర్ చేస్తున్నారు.

