తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా గెజిట్ విడుదలైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై గతంలో తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో దానం నాగేందర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే పదవి రద్దు కావడంతో అసెంబ్లీ సెక్రటేరియట్ గెజిట్ విడుదల చేసింది.
నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక పూర్తి చేయాలి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితికి ఇంకా రెండేళ్ల సమయం మిగిలి ఉంది. అందువల్ల ఖైరతాబాద్‌లో బైపోల్ నిర్వహించడం అనివార్యంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే నెల 6న దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అందువల్ల ఆ తేదీన ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఈ స్థానానికి ప్రత్యేకంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ తాజా పరిణామాలతో ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు ఈ ఉప ఎన్నిక ఫలితాలపై దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. బైపోల్‌లో ఊహించని రీతిలో దిమ్మతిరిగే ఫలితాలు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల బరిలో తన సత్తా ఏంటో చూపిస్తానని స్పష్టం చేశారు. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాజకీయం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

