11 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌..!

అంతర్జాతీయ చదరంగం క్రీడలో భారత సంతతికి చెందిన బాలిక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బోధనా శివానందన్ కేవలం 11 ఏళ్ల వయసులోనే మహిళా గ్రాండ్‌మాస్టర్ (WGM) హోదాను దక్కించుకుంది. చెస్ చరిత్రలోనే ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లోకెక్కింది.

ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్‌లో బోధనా ఇంగ్లాండ్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అత్యుత్తమ ఎత్తులతో అంతర్జాతీయ క్రీడాకారులను ఓడించి ఈ మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన రికార్డు సాధించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. ఇక్కడితో తన ప్రయాణం ఆగదని పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించి చరిత్ర సృష్టిస్తూనే ఉండటమే తన లక్ష్యమని ప్రపంచ చెస్ సమాఖ్య (FIDE)తో వెల్లడించింది.

బోధనా చదరంగం ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆమె తండ్రి స్నేహితుడు భారత్‌కు తిరుగుప్రయాణమయ్యారు. వెళ్లే సమయంలో ఆయన బోధనకు కొన్ని బహుమతులు అందజేశారు. వాటిలో ఒక చదరంగం బోర్డు కూడా ఉంది. ఆ చెస్ బోర్డుతో ఆడుకుంటూ ఆమె ఈ ఆట పట్ల ఆకర్షితురాలైంది. అతి తక్కువ కాలంలోనే ఆటలోని మెళకువలను నేర్చుకుంది.

ప్రస్తుతం వాయువ్య లండన్‌లో నివసిస్తున్న బోధనా.. పాఠశాల విద్యను అభ్యసిస్తూనే చదరంగం సాధన చేస్తోంది. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంగ్లీష్ చెస్ ఫెడరేషన్ తరఫున అధికారికంగా పోటీలు ఆడటం ప్రారంభించింది. ఏ క్రీడలోనైనా అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఇప్పటికే గుర్తింపు పొందింది. తాజా విజయంతో అంతర్జాతీయ చెస్ రంగంలో భారత ప్రతిభను మరోసారి చాటిచెప్పింది.